‘సిరివెన్నెల’ను చూసి భోరుమన్న త్రివిక్రమ్, భరణి, పురాణపండ.

‘సిరివెన్నెల’ను చూసి భోరుమన్న త్రివిక్రమ్, భరణి, పురాణపండ.

Published on Nov 30, 2021 5:00 PM IST

హైదరాబాద్ : నవంబర్ : 30

తెలుగు పాటని అంతర్జాతీయ స్థాయిలో , చాలా చాలా అందమైన పదాల పల్లకిలో ఊరేగించి … లక్షల యువతీయువకులకు సైతం ఆరాధనీయ రచయితగా విఖ్యాతి చెందిన ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తెలుగునాట ఎన్నో సాహిత్య సంస్థలు, ప్రముఖ కవులు , రచయితలు, సినీరంగ ప్రముఖులు , రాజకీయరంగ ప్రముఖులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ వార్త విన్న ప్రఖ్యాత దర్శకుడు , రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ విషణ్ణ వదనంతో భౌతిక కాయం చెంతకు చేరుకున్నారు. తన ఆత్మ బంధువు తనను వీడాడన్న బాధ త్రివిక్రమ్ ని గుండెకోతకు గురి చేసిందనేది అక్కడ కనిపిస్తూనే వుంది. మరో అద్భుత రచయిత , సినీ నటుడు తనికెళ్ళ భరణి కన్నీటి పర్యంతమయ్యారు.

తెలుగు మీడియా సైతం ఎప్పటికప్పుడు ఎన్నెన్నో పాటలతో , సీతారామ శాస్త్రి విలువల జీవనాన్ని, పాటల ప్రస్థానాన్ని తమ నివాళిగా దుఃఖంతో ప్రకటిస్తూనే వుంది.

అద్భుత వ్యకిత్వంతో, మహా ప్రతిభా సంపన్నమైన పాటలతో తెలుగు ఎదలను పరవశింపచేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి హృదయ సంస్కారానికి , గేయ సౌందర్యానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ గద్గద స్వరంతో , బరువెక్కిన దుఃఖ పూరిత హృదయంతో ‘ తనకిక భూగోళంపై ఆకుపచ్చని వెన్నెల పాట వినిపించదని ‘ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక కనిపించరన్న వార్త తన మనస్సు చుట్టూ భయంకరమైన ఉద్విగ్నతను ఆవరింప చేసిందని ఆసుపత్రివద్ద మీడియా వారితో అనడం అక్కడ చుట్టూ వున్నవారి చేత సైతం కన్నీళ్లు తెప్పించింది.

శ్రీనివాస్ భోరున విలపించి ఈ భౌతిక కాయాన్ని చూడలేనని కారెక్కి వెళ్లిపోవడం హృదయం ద్రవింప చేసింది. సరిగ్గా ఆ సమయంలోనే సిరివెన్నెల భౌతిక కాయాన్ని ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇంకా ఆసుపత్రిలోనే భౌతిక కాయం వుంది.

దశాబ్దన్నర క్రితం విఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు సమర్పణలో లక్షల ప్రతులతో సంచలన సినీ వార పత్రికగా ఖ్యాతి గాంచిన ‘ శివరంజని ‘ సినీ వార పత్రికలో సిరివెన్నెల సీతారామ శాస్త్రితో ఇరవై ఏడు వారాలపాటు ‘ స్వరాలూ ఊయలూగువేళ ‘ శీర్షికతో ఒక అద్భుత ధారావాహికను అపురూపంగా నడిపించిన ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్. ఆరోజుల్లో సీతారామ శాస్త్రితో శ్రీనివాస్ రచించి నిర్వహించిన ఈ శీర్షికకు వేలల్లో ఫాలోయర్స్ ఉన్నారనేది నిర్వివాదాంశం.

చాలా కాలంగా సభలకు, సమావేశాలకూ దూరంగా ఉంటూ తెలుగు ఆధ్యాత్మిక రంగంలో దూసుకుపోతున్న పురాణపండ శ్రీనివాస్ ‘ ‘సిరివెన్నెల ‘ లేరన్న వార్తకి దుఃఖించిన తీరు
వర్ణనాతీతంగానే చెప్పాలి.

మీడియా మాట్లాడమని కోరగా మీడియా కెమెరాలకు చెయ్యి అడ్డుపెట్టి
” కొనుక్కుందామన్నా, కోరుకుందామన్నా ఇలాంటి వెన్నెల దొరుకుతుందా … ఇది సరస్వతీదేవి కన్నుల వెన్నెల . దీన్ని కొలవలేం. ” ఈ అద్భుతం గురించి ఏం మాట్లాడమంటారు. కెమెరాలు దూరంగా ఉంచండి దయచేసి ఏం మాట్లాడలేనంటూ వెళ్లిపోయారు.

ఇప్పటికే సిరివెన్నెల ధన్యజీవనుడని ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.సి.ఆర్ , జగన్ మోహన్ రెడ్డి నివాళి ఘటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు