బాలీవుడ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న పూరి హీరోయిన్ !

27th, February 2017 - 09:52:23 AM


మొదట ‘1920’ చిత్రంతో హిందీ పరిశ్రమలో నటిగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఆదా శర్మ 2014 లో దర్శకుడు పూరి జగన్నాథ్ నితిన్ హీరోగా డైరెక్ట్ చేసిన ‘హార్ట్ అటాక్’ చిత్రం ద్వారా తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో మూడు నాలుగు సినిమాలు చేసినప్పటికీ ఒక్క ‘క్షణం’ మినహా ఈ కేరళ బ్యూటీకి ఆశించిన బ్రేక్ రాలేదు. దీంతో ఆమె తాను ఎక్కడైతే రంగ ప్రవేశం చేసిందో అక్కడే సక్సెస్ అందుకోవాలని నిర్ణయించుకుని బాలీవుడ్ పై దృష్టి పెట్టింది.

ప్రస్తుతం ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘కమాండో 2’ మార్చి 3వ తేదీన విడుదలకు సిద్ధమైంది. విద్యుత్ జమ్వాల్ హీరోగా దేవేన్ భోజనీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన హీరోయిన్ రోల్ లో కనిపించనుంది. పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం పైనే ఆదా శర్మ ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చే కమర్షియల్ సక్సెస్ తో ఆమెకు బాలీవుడ్ లోనే గాక తెలుగులో సైతం మంచి ప్రాజెక్ట్స్ దక్కే అవకాశముంది.