“పుష్ప” మా సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతుంది – పుష్ప నిర్మాతలు

“పుష్ప” మా సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతుంది – పుష్ప నిర్మాతలు

Published on Dec 10, 2021 11:30 PM IST


ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “పుష్ప”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాతలతో పాటు మైత్రీ మూవీమేకర్స్ సీఈవో చిరంజీవి చెర్రీ మీడియాతో మాట్లాడుతూ మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచే విధంగా పుష్ప చిత్రం ఉంటుందని అన్నారు. పాన్ ఇండియన్ సినిమా చేయాలనే మా కల ఈ సినిమాతో తీరనుంది. దర్శకుడు సుకుమార్ చెప్పిన పుష్ప కథ వినగానే అన్ని భాషల వారికి చేరువ అయ్యే యూనివర్శల్ కథ అవుతుందనిపించిందని, ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో సినిమాను విడుదలచేయబోతున్నామని అన్నారు.

అరుదైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎర్రచందనం అక్రమరవాణాతో పాటు మానవీయ విలువలు, భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచుతుంది. రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగుతుందని అన్నారు. సినిమాలో ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ నటన అద్భుతమని, స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. మాస్ కథకు క్లాస్ హంగులను మేళవిస్తూ అన్ని వర్గాల్ని అలరించేలా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటల్ని స్వరపరిచారు. ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలు సూపర్‌హిట్ అవ్వడం ఆనందంగా ఉంది.

ఇకపోతే సినిమా చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పటివరకు ఎవరూ వెళ్లని అరుదైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశామని, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నామని అన్నారు. ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తుంది. ఆఖండ విజయం మాలోనూ ఉత్సాహాన్ని నింపింది. ఆ విజయపరంపరను మా చిత్రం కొనసాగిస్తుందనే నమ్మకముంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త పంథాలో అల్లు అర్జున్ కనిపిస్తారు. చిత్తూరు యాసలో ఆయన చెప్పిన సంభాషణలు మెప్పిస్తాయి. బన్నీ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అన్నారు.

ఈ సినిమా కోసం ఏడాది మొత్తం పుష్పరాజ్ పాత్రలోనే ఉండిపోయారు. ఆయన మేనరిజమ్స్ విభిన్నంగా ఉంటాయి. పుష్పరాజ్ పాత్రకు సంబంధించి ఆయన మేకప్‌ కోసమే ప్రతిరోజు రెండు గంటలు సమయం పట్టేది. ఫహాద్‌ ఫాజిల్ మా అందరి ఊహలకు మించి అద్భుతంగా నటించాడు. రష్మిక మందన్న, సునీల్, అనసూయతో పాటు ప్రతి క్యారెక్టర్ సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ నవ్యరీతిలో సాగుతాయి. ప్రతీ భాషలోనూ చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌నే చూపించాం. పుష్ప సెకండ్‌పార్ట్ షూటింగ్‌ను ఫిబ్రవరిలో మొదలుపెడతాం. ప్రస్తుతం మా సంస్థలో మహేష్‌బాబు ‘సర్కారువారి పాట’, నానితో ‘అంటే సుందరానికి’ సినిమాలు చేస్తున్నాం. చిరంజీవి సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. బాలకృష్ణతో చేయబోతున్న చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్‌పైకి తీసుకొస్తామని, కళ్యాణ్ రామ్‌తో అమిగోస్ అనే చిత్రం చేయబోతున్నామని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు