‘టెంపర్’ సినిమాను కావాలనే వదులుకున్నా : ఆర్. నారాయణమూర్తి
Published on Jan 6, 2017 1:14 pm IST

r-narayanamurthy
తెలుగు సినీ పరిశ్రమలో విప్లవ సినిమాల కథానాయకుడంటే వినిపించే ఒకే ఒక్క పేరు.. ఆర్. నారాయణ మూర్తి. ప్రజల బాధలనే తన కథలుగా చేసుకొని ఎన్నో విప్లవ చిత్రాలను తెరకెక్కించిన ఆయన పీపుల్స్ స్టార్‌గా తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన సినిమాలేవీ ప్రేక్షకుల మన్ననలను పొందలేకపోయాయి. ఇదే క్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, తాను తెరకెక్కించిన ‘టెంపర్’ అనే సినిమాలోని హెడ్‌కానిస్టేబుల్ మూర్తి అనే పాత్రకు మొదట ఆర్.నారాయణ మూర్తినే సంప్రదించారు. కాగా ఆర్. నారాయణ మూర్తి మాత్రం సున్నితంగా ఆ సినిమాను తిరస్కరించారు. ఆ తర్వాత అదే పాత్రలో పోసాని కృష్ణమురళి నటించారు.

తాజాగా తాను హీరోగా నటించిన ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ అనే సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతోన్న సందర్భంగా నారాయణ మూర్తి సినిమా గురించి మాట్లాడుతూ మధ్యలో ‘టెంపర్’ ప్రస్తావన తెచ్చారు. ఆ సినిమాను ఎందుకు వదులుకున్నాన్నది తెలుపుతూ.. “ఈతరం సినీ దర్శకుల్లో పూరీ జగన్నాథ్ గారంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నేనంటే కూడా ఆయనకు చాలా అభిమానం. ఆ అభిమానంతోనే టెంపర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా ఎదిగిన నేను మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాలనుకోలేదు. చేస్తే హీరోగానే సినిమాలు చేయాలన్నది నా ఆలోచన. అది నా దర్శకత్వంలోనేనా? ఇతరుల దర్శకత్వంలోనా? అన్నది పట్టింపు లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడం ఇష్టం లేకే ఆ సినిమా వదులుకున్నా. నా ఆలోచనను గౌరవించిన పూరీ జగన్నాథ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్‍ గారికి ధన్యవాదాలు. ఎప్పటికీ హీరోగానే కొనసాగుతా” అని తెలిపారు.

ఇక తన సినిమా హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్యను సంక్రాంతికే విడుదల చేస్తున్నా, ప్రస్తుతానికైతే థియేటర్ల కొరత చాలా ఉందని, పెద్ద సినిమాలే అన్ని థియేటర్లను ఆక్రమించుకుంటున్నాయని నారాయణ మూర్తి అన్నారు. ఈ సంక్రాంతికి వస్తోన్న పెద్ద సినిమాలతోనే థియేటర్లు నింపేస్తున్నారని, చిన్న సినిమా ఎప్పుడు విడుదల కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాను పూర్తిగా తొక్కేస్తున్నారని, దారుణమైన పరిస్థితి కొనసాగుతుందని నారాయణ మూర్తి ఆవేశంగా మాట్లాడారు. చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాలో జయసుధ ఓ ప్రధాన పాత్రలో నటించారు.

 
Like us on Facebook