వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ కే ఫిక్సైపోయాడా?


ఇటీవలే ‘ఫిదా’ సినిమాతో బంపర్ హిట్ అందుకుని కెరీర్లోనే అత్యధిక వసూళ్లను నమోదుచేసుకున్న మెగాహీరో వరుణ్ తేజ్ తన తర్వాతి చిత్రం కూడా ‘ఫిదా’ బాటలోనే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండాలని నూతన దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాకి సైన్ చేశాడు. ఇప్పటికే హైదరాబాద్లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం లండన్లో చిత్రీకరణ జరుపుకునేందుకు సిద్ధమైంది. హీరో వరుణ్ తేజ్, ఇప్పటికే లండన్ చేరుకోగా హీరోయిన్ రాశీఖన్నా కూడా పయనమయ్యారు.

ఇకపోతే ఆరంభంలో ఈ సినిమాకు పవన కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ టైటిల్ ను అనుకుంటున్నారని వార్తలు వచ్చినా చిత్ర యూనిట్ వాటిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ ఈరోజు పొద్దున్నే హీరోయిన్ రాశీఖన్నా మాత్రం తన ఇన్ స్టాగ్రమ్ అకౌంట్లో ‘తొలిప్రేమ’ కోసం లండన్ వెళుతున్నాను అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ నే తన సినిమా టైటిల్ గా ఫిక్సైపోయాడని అంతా అనుకుంటున్నారు. మరి ఈ వార్తపై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాలి. ఇకపోతే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.