ఇంటర్వ్యూ : వెన్నెల కిశోర్ – రాఘవేంద్రరావుగారు హీరోగా చేయవద్దని నాచేత ఒట్టేయించుకున్నారు !

ఇంటర్వ్యూ : వెన్నెల కిశోర్ – రాఘవేంద్రరావుగారు హీరోగా చేయవద్దని నాచేత ఒట్టేయించుకున్నారు !

Published on May 23, 2017 1:24 PM IST


టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కామెడియన్లున్నా వెన్నెల కిశోర్ ది మాత్రం ఒక భిన్న శైలి. సినిమా సినిమాకు ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించే ఆయన తాజాగా విడుదలైన ‘కేశవ’ చిత్రంలో కూడా కొత్తదనాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కీలక పాత్రలో నటించిన ‘అమీ తుమీ ‘ విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ‘కేశవ’ సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
జ) మొదట డైరెక్టర్ సుధీర్ వర్మ సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఒకటే ఎమోషన్ అని చెప్పడంతో ఇక ఆ పాత్రలో కామెడీ ఏం ఉంటుంది అనుకున్నా. కానీ షూటింగ్ టైంలో తెలిసింది అందులో ఎంత ఉందో. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది.

ప్ర) నెక్స్ట్ సినిమా ‘అమీ తుమీ’ లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) ‘అమీ తుమీ’ లో నాది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అడివి శేష్, అవసరాల పాత్రలతో సమానంగా నా పాత్రను రాశారు. ఇందులో కొన్ని నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ ఫన్నీగానే ఉంటాయి.

ప్ర) కథలో మీ పాత్ర ఏం చేస్తుంది ?
జ) రెండు రోజుల్లో నా జీవితంలో ఏం జరుగుతుంది అనేదే కథ. పెళ్లి కోసం వచ్చిన నేను అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ ల ప్రేమ కథల మధ్యలోకి ఎలా వెళతాను, ఆ టైమ్ లో నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది మంచి కామెడీని జనరేట్ చేస్తుంది. స్టోరీ పరంగా చూస్తే నేను విలన్.

ప్ర) అంటే హీరోలతో సమానమైన పాత్రా ?
జ) అవును. కథలో వాళ్లకెంత ప్రాముఖ్యత ఉంటుందో నాకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళతో పోటా పోటీగా నటించే స్కోప్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకెన్ని సన్నివేశాలుంటాయో నాక్కూడా అన్నే ఉంటాయి.

ప్ర) ఇందులో కూడా కామెడీ కొత్తగానే ఉంటుందా ?
జ) అవును.. ఇంతకూ ముందు చేసిన సినిమాల్లోకి ఈ సినిమాలోకి తేడా ఉంటుంది. నా క్యారెక్టర్ జనాల్లోకి వెళ్ళిందంటే మాత్రం అది పూర్తిగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి క్రెడిటే.

ప్ర) ఇంద్రగంటిగారితో వర్క్ ఎలా ఉంది ?
జ) ఫస్ట్ టైమ్ ఆయనతో ‘జెంటిల్మెన్’ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. సినిమాకి కొన్ని రోజుల ముందే అయన పూర్తి స్క్రిప్ట్ తో సహా మాకిచ్చేశారు. మేము కూడా ముందుగానే ప్రాక్టీస్ చేశాం. దాంతో షూటింగ్ స్పాట్ కు వెళ్ళాక కెమెరా ముందు పెద్ద కష్టమనిపించలేదు. ఆయనతో వర్క్ చాలా ఈజీగా ఉంటుంది.

ప్ర) ప్రస్తుతం మీ కెరీర్ ఎలా సాగుతోంది ?
జ) చాలా సాఫీగా సాగుతోంది. కేశవ సినిమా అయితే ఇంకో మూడేళ్లు ఇండస్ట్రీలో నిలబడటానికి అవకాశామిచ్చింది.

ప్ర) అంటే మీ కెరీర్ పట్ల మీరు సంతృప్తి చెందారా ?
జ) అవును పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఇప్పటికే 150 సినిమాల దాకా చేశాను. ఒక్కోసారి సాదించాల్సిన పేరుకంటే ఎక్కువే వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు థియేటర్లలో ఏ హీరోలకైతే విజిల్స్ వేశానో ఇప్పుడు ఆ హీరోల పక్కనే నటిస్తుండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది.

ప్ర) హీరోగా చేసే ఆలోచనలేమైనా ఉన్నాయా ?
జ) అబ్బే అస్సలు లేవు. ఎందుకంటే నేనసలు హీరోగానే సెట్టవ్వను. ఒకసారి షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ రాఘవేంద్రరావుగారు పిలిచి కామెడీ బాగా చేస్తున్నావ్. హీరోగా మాత్రం చేయనని మాటివ్వు అన్నారు. నేను కూడా అస్సలు చేయనని ఒట్టేశాను.

ప్ర) ఇంకా ఏయే సినిమాలు చేస్తున్నారు ?
జ) ప్రస్తుతం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ రిలీజుకు రెడీగా ఉంది. అందులో హీరో ఫ్రెండ్ పాత్ర. రారండోయ్ వేడుక చూద్దాం అనే పాట నా పెళ్లిలోదే. అందులో కూడా మంచి క్యారెక్టర్.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు