ఖైదీ టైటిల్ సాంగ్ కంపోజ్ చేయడం నా అదృష్టమంటున్న లారెన్స్ !
Published on Dec 20, 2016 8:42 am IST

raghava-lawrence
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150’ చిత్రం పట్ల అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఎంతటి భారీ అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలను అందుకోవాలని ఖైదీ టీమ్ కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. చిరంజీవి లుక్స్ దగ్గర్నుంచి పాటలు, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ అదిరిపోయేలా రూపొందిస్తున్నారు. ఈ మధ్య విడుదలైన టీజర్ కు ఎంతటి స్పందన వచ్చిందో మొన్న ఆదివారం విడుదలైన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాటకు కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఈ పాటకు యూట్యూబ్ లో 2 మిలియన్ల వ్యూస్ దక్కాయి.

దేవి శ్రీ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటను విన్న అభిమానులంతా పాటే ఈ రేంజులో ఉంటే చిరు స్టెప్పులో అదిరిపోయి ఉంటాయని ఊహించుకుంటూ థియేటర్లలో ఆ పాటను చూడ్డానికి తెగ తొందరపడిపోతున్నారు. ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసింది మరెవరో కాదు చిరు ఫెవరెట్ కొరియోగ్రఫర్ రాఘవ లారెన్స్. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా తెలుపుతూ ‘చాలా కాలం తరువాత చిరంజీవి గారి పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశాను. అదీ అయన 150వ సినిమాకి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం అందరు అభిమానుల్లాగే నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అంటూ తన ఆనందం వ్యక్తం చేశాడు.

 
Like us on Facebook