‘బాహుబలి-3’ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి !

3rd, May 2017 - 07:50:15 PM


‘బాహుబలి-2’ చిత్రాన్ని ఎండ్ టైటిల్స్ పడే వరకు చూసిన ప్రేక్షకులకు తప్పకుండా ‘బాహుబలి-3’ కూడా ఉంటుందా అనే సందేహం రాక మానదు. జక్కన్న బాహుబలి సిరీస్ లో రెండవ భాగమే ఆఖరి చిత్రమని చెప్పినప్పటికీ ఆఖరులో తణికెళ్ల భరణికి, చిన్న కుర్రాడికి మధ్య నడిపిన చిన్నపాటి సంభాషణతో ఆయన ముందు జాగ్రత్తగా మూడవ పార్ట్ కు లీడ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. దీంతో అందరిలోనూ మూడవ పార్ట్ పై ఆసక్తి ఎక్కువైంది.

ఇదే అంశంపై ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్న రాజమౌళి మాట్లాడుతూ ‘సినిమాకు మార్కెట్ ఉంది కాబట్టి ఏదో ఒక స్టోరీతో సినిమా చేస్తే అది భావ్యమనిపించుకోదు. కానీ ఎవరికి తెలుసు ఒకవేళ మా నాన్నగారు అనువైన కథను సిద్ధం చేస్తే మూడవ భాగం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అన్నారు. దీన్నిబట్టి రాజమౌళికి మూడవ పార్ట్ తీయాలన్న ఆలోచన బలంగా లేకపోయినా ఒకవేళ విజయేంద్ర ప్రసాద్ గనుక అనువైన కథను రెడీ చేస్తే చేయకుండా ఉండరని అర్థమవుతోంది.