జనతా గ్యారేజ్ పై జక్కన్న ప్రసంశల వర్షం

SS-RAJAMOULI
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పొద్దుపొద్దున్నే ఎంతో ఉత్సాహంగా సినిమాని తిలకించారు. ముఖ్యంగా దర్శక ధీరుడు, ఎన్టీఆర్ కు మంచి మిత్రుడైన రాజమౌళి భ్రమరాంబ థియేటర్లో అభిమానులతో పాటు బెన్ఫిట్ షో చూసి ట్విట్టర్ లో సినిమాపై ప్రసంశల వర్షం కురిపించారు.

‘మోహన్ లాల్, తారక్ ల మధ్య ఉన్న సూక్ష్మమైన సంబంధం చాలా బాగుంది. వాళ్లిద్దరి పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేశాను. టెంపర్ సినిమా నుంచి కెరీర్లో మంచి మంచి పాత్రలను ఎంచుకుంటున్న తారక్ ను చూస్తుంటే గర్వాంగా ఉంది. నా ఫ్రెండ్ రాజీవ్ కనకాల కూడా సిన్సియర్ గవర్నమెంట్ క్లర్క్ పాత్రలో బాగా నటించాడు. ఇప్పటికే సినిమాని రెండుసార్లు చూసి ఎంజాయ్ చేశాను’ అన్నారు. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ సినిమా బాగుందని మెచ్చుకోవడంతో జనతా గ్యారేజ్ టీమ్ తో పాటు అభిమానులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు.