
గుణశేఖర్ ఎన్నో ఏళ్ళ పాటు పరిశోధించి, దాదాపుగా మూడేళ్ళ పాటు ఒకే కల కంటూ పడిన కష్టం రుద్రమదేవి సినిమాగా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా అన్నిచోట్లా సూపర్ కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఒక చారిత్రక కథను ప్రేక్షకులకు చేరవేయాలన్న గుణశేఖర్ ఆలోచనకు, అల్లు అర్జున్, అనుష్కల నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ తరపున పలువురు ప్రముఖులు రుద్రమదేవి సినిమాను, గుణశేఖర్ ప్రయత్నాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా ఈ జాబితాలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా చేరిపోయారు.
‘రుద్రమదేవి’ సినిమాను ప్రశంసిస్తూ దర్శకుడు రాజమౌళి ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో “గోనగన్నారెడ్డి పాత్ర రుద్రమదేవికి హైలైట్. ఎప్పుడైనా సినిమా డల్ అయిపోయినట్లు కనిపించగానే గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ ఎంట్రీ సినిమాను నిలబెట్టింది. ఇక రుద్రమదేవి లాంటి పాత్రను అనుష్క తప్ప వేరొకరు చేయలేరేమో! అనుష్క సిన్సియారిటీ, కమిట్‌మెంట్ అద్భుతం. చారిత్రక సినిమా తీయాలన్న ఆలోచన రాగానే రానా తప్పక మదిలో మెలగాల్సిందే. గుణశేఖర్ గారికి ఆయన టీమ్‌కు ఇలాంటి ఒక సినిమా చేయాలన్న ఆలోచన చేసినందుకు, దాన్ని విజయం దిశగా నడిపించినందుకు అభినందనలు” అని తెలిపారు. ఇక ఇప్పటికే మంచి ఫీడ్‌బ్యాక్‌తో వెళుతోన్న ఈ సినిమాకు రాజమౌళి ట్వీట్స్ మరింత బూస్ట్ ఇస్తాయనే చెప్పాలి.