ధోనీ ఫంక్షన్‌కు రావడానికి కోటి రూపాయలైనా ఇచ్చేవాణ్ణి : రాజమౌళి
Published on Sep 25, 2016 2:48 pm IST

dhoni-rajamouli

ఎం.ఎస్.ధోని.. భారతదేశంలో క్రికెట్ తెలిసిన ప్రతివ్యక్తికీ పరిచయం ఉన్న పేరు. భారత క్రికెట్‌కు తిరుగులేని విజయాలను అందించిన ధోని జీవిత కథతో బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే, ‘ఎం.ఎస్.ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీ పాత్రలో నటించారు. ఇక ధోనికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ చేస్తున్నారు. ఇందులో తెలుగు వర్షన్‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి ఆసక్తి రేకెత్తించింది. తాజాగా నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో తెలుగు వర్షన్ ఆడియో లాంచ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మహేంద్ర సింగ్ ధోనీ ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషంగా నిలిచింది. ఇక ఈ సందర్భంగానే రాజమౌళి మాట్లాడుతూ.. “ధోనీ సినిమా ఆడియో లాంచ్‌కు రాగలరా? అని నన్నడిగినప్పుడు.. రాగలరా అని అడగమా? రావడానికి కోటి రూపాయలివ్వాలంటే వెంటనే ఇచ్చేసేవాణ్ణి.” అంటూ రాజమౌళి ధోనీపై ఉన్న అభిమానాన్ని చూపుతూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తిరుగులేని శక్తిగా ధోని ఎలా ఎదిగాడు అన్న కథాంశంతో తెరకెక్కిన ధోనీ, సెప్టెంబర్ 30న అన్ని భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook