రాజమౌళికి లాస్ట్ వర్కింగ్ డే !


‘బాహుబలి’ సిరీస్ దాదాపు పూర్తైపోయింది. నిన్నన్నే సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగిశాయి. అలాగే ఈరోజుటితో సినిమాకు సంబంధించి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పనులు కూడా పూర్తైపోయాయి. ఈ చిత్రానికి గాను ఈరోజే ఆయన లాస్ట్ వర్కింగ్ డే. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాదాపు 5 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా ఈ ప్రాజెక్ట్ కోసమే ఖర్చు చేసిన రాజమౌళి ఈరొజే తన చివరి పని దినం అంటూ ‘ఎంత గొప్ప ప్రయాణం, ఎంత గొప్ప అనుభవం.. సంతోషంతో పాటు కాస్త బాధగా కూడా ఉంది’ అనడం నెటిన్లను కూడా కదిలించింది.

నిజంగా ఏ దర్శకుడు చేయని సాహసం రాజమౌళి చేశారు. సినిమా సక్సెస్ కన్నా కూడా ఆయన చేసిన కష్టం, సినిమా పట్ల ఆయన అంకిత భావం చూసి దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు పెరిగారు. ప్రతి సినీ ప్రేమికుడు వాళ్ళ కష్టానికి తప్పక ఫలితం దొరకాలని ఆశిస్తున్నారు. మరోవైపు ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు కూడా తమ వంతుగా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.