క్రిష్‌ను అభినందిస్తూ లేఖ రాసిన రాజమౌళి!

22nd, January 2017 - 03:59:11 PM

rajmouli
రాజమౌళి అంటే ఇండియన్ సినిమాలో ఇప్పుడొక సెన్సేషనల్ డైరెక్టర్. బాహుబలి అనే సినిమాతో ఒక ప్రాంతీయ భాషా సినిమాను, బాక్సాఫీస్ స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళి, ఏదైనా సినిమా మెచ్చారన్నా కూడా దానిపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతూ ఉంటుంది. తెలుగులో దాదాపుగా విడుదలయ్యే ప్రతి పెద్ద సినిమానూ చూస్తూ ఉండే రాజమౌళి, తాజాగా క్రిష్ తెరకెక్కించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను కూడా చూశారు. ఆ సినిమా చూసిన వెంటనే నందమూరి బాలకృష్ణను, క్రిష్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతూ ట్వీట్ కూడా చేశారాయన.

ఇక ఆ తర్వాత ఏకంగా సినిమా గురించి విశేషాలు తెలుసుకుంటూ క్రిష్‌తో ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. వీటితో పాటు క్రిష్‌ను అభినందిస్తూ రాజమౌళి స్వయంగా ఒక లెటర్ రాయడం విశేషంగా చెప్పుకోవాలి. అంజనాపుత్ర క్రిష్ అంటూ మొదలుపెట్టి రాజమౌళి ఆ లేఖలో క్రిష్‌పై ప్రశంసలు కురిపించారు. 79 రోజుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఒక సినిమాను పూర్తి చేయడం అభినందించదగ్గ విషయమని రాజమౌళి అన్నారు. ఇక చివర్లో ఇట్లు రాజనందిని పుత్ర రాజమౌళి అంటూ సినిమా టైటిల్ స్టైల్‌ను రాజమౌళి ఫాలో అవ్వడం ఆసక్తికరంగా కనిపించింది.