రాజకీయ దుమారానికి తెరదించిన రజనీకాంత్ !

23rd, March 2017 - 11:16:09 AM


సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాట ఎప్పటికప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆయన ఏ రాజకీయనాయకుడిని కలిసినా రజనీ ఆ వ్యక్తికి, అతని పార్టీకి సపోర్ట్ చేస్తున్నరని, త్వరలోనే ఆయన కూడా ఆ పార్టీలో చేరిపోతారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఊహాగానమే ఒకటి తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. జయలలిత మరణం తర్వాత ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్నాయి.

ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ పోటీ చేస్తున్నారు. ఆయన ఇటీవలే రజనీకాంత్ ని కలిశారు. రజనీ కూడా ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. ఆ విషయాన్నే చెబుతూ అమరను కుమారుడు వెంకట్ ప్రభు ‘మా తలైవర్ రజనీకాంత్ మా నాన్నను కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని విష్ చేశారు’ అంటూ ట్వీట్ తో పాటు ఫోటో కూడా పెట్టారు. దాని వలన అందరూ రజనీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం మొదలుపెట్టారు.

అది కాస్త పెను దుమారంగా మారడం గమనించిన రజనీకాంత్ ఇక లాభం లేదనుకుని కొద్దిసేపటి క్రితమే తన ట్విట్టర్ ద్వారా ‘రాబోయే ఎన్నికల్లో నా సపోర్ట్ ఎవరికీ లేదు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అనవసరంగా ప్రచారంలో ఉన్న రూమర్లన్నింటికీ చెక్ పడ్డట్టైంది.