ఆగష్టు నెలైతే బాగుంటుందనుకుంటున్న నాగ్ !


ఓంకార్ డైరెక్ట్ చేసిన హర్రర్ చిత్రం ‘రాజుగారి గది’ మంచి సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ‘రాజుగారి గది 2’ తెరకెక్కుతోంది. అక్కినేని నాగార్జున, స్టార్ హీరోయిన్ సమంతలు నటిస్తుండంతో క్రేజ్ పెరిగి ఈ సీక్వెల్ పెద్ద ప్రాజెక్ట్ గా మారిపోయింది. అంతేగాక కొత్తదనమున్న సినిమాలు మాత్రమే చేస్తున్న నాగార్జున ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అందరిలోనూ సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి మొదలైంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఆగష్టు 25వ తేదీన విడుదల చేయాలని నాగ్ అండ్ టీమ్ భావిస్తున్నారట. అయితే ఇంకా ఈ తేదీపై స్పష్టమైన నిర్ణయం ఏదీ ఖాయం కాలేదు. నాగార్జునకు జోడీగా శీరత్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని పివిపి సినిమా, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో నాగార్జున, సమంతల పాత్రలు కథకు అనుగుణంగా నడుస్తూ చాలా వైవిధ్యంగా ఉంటాయని సమాచారం.