
రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో పాగా వేసిన హీరోయిన్. ఆ సినిమాలో తన అందంతో, నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ‘లౌక్యం’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న రకుల్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా రవితేజ ‘కిక్ 2’, రామ్ ‘పండగ చేస్కో’, రామ్ చరణ్ – శ్రీనువైట్లల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న రకుల్, త్వరలోనే ఎన్టీఆర్ సినిమాలోనూ నటించేందుకు సిద్ధమైంది. అయితే గత కొలంగా ఆమెను ఈ సినిమా నుంచి తప్పించినట్లు పుకార్లు పుట్టుకొచ్చాయ్. తాజాగా ఆ పుకార్లను రకుల్ ఖండించింది.
“ఈ పుకార్లు ఎక్కణ్ణుంచి పుట్టుకొచ్చాయో తెలియయటం లేదు. ఎన్టీఆర్ 25వ సినిమాలో నేను నటిస్తున్నా. ఇదే విషయాన్ని మరొక సారి మీకు తెలియజేస్తున్నా” అంటూ తన ట్విటర్ ఎకౌంట్లో ట్వీట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం యూకేలో జరగనుంది. ఏప్రిల్ 17న ఈ సినిమా అధికారికంగా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. బీవీఎస్ఎన్ ఈ సినిమాకు నిర్మాత.