దర్శకులంటే గుర్తొచ్చేది వాళ్లిద్దరేనన్న రామ్ చరణ్ !


స్టార్ డైరెక్టర్ సుకుమార్ రచనలో, నిర్మాణంలో రూపొందిన సినిమా ‘దర్శకుడు’. ఈ సినిమా యొక్క ఆడియో వేడుక నిన్న సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. వేదికపై ఆయన ఇచ్చిన స్పీచ్ కార్యక్రమానికే హైలేట్ గా నిలిచింది. ఇండస్త్రీలో దర్శకులంటే తనకు గుర్తొచ్చేది దాసరి నారాయణరావుగారు, రాఘవేంద్రరావుగారు అన్న చరణ్ ప్రతి దర్శకుడు వాళ్ళ నుండి స్ఫూర్తి పొందకుండా ఉండడని అన్నారు.

అలాగే దర్శకుడిగానే కాక రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న సుకుమార్ నిర్మాణ సంస్థ స్థాపించి దర్శకులను, నటీనటులను పరిచయం చేయడమనేది గొప్ప విషయమని, ఆయన సినిమాల్లో కథ ఏదైనా లవ్ స్టోరీ మాత్రం తప్పకుండా ఉంటుందని, ఆయన చేసిన మొదటి సినిమా నుండి ఇప్పుడు చేస్తున్న ‘రంగస్థలం 1985’ వరకు అన్నింటిలో లవ్ స్టోరీ ఉంటుందని, ఈ ‘దర్శకుడు’ సినిమాకి కూడా అదే బలమవుతుందని అనుకుంటున్నట్లు తెలిపారు.

అలాగే కేవలం తమని మాత్రమే కాకుండా తమకి ఇష్టమైన దర్శకులని, నటుల్ని కూడా ఆదరిస్తున్న తమ అభిమానులది పెద్ద హృదయమని, తన ఈ సినీ జర్నీలో ఉన్న దర్శకులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలని అన్నారు. హరి ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఆగష్టు 4న రిలీజ్ కానుంది.

Exit mobile version