మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్!

ram-charan-interview
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. కొద్దినెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం చిరు పాల్గొంటుండగా, స్టంట్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్-లక్ష్మణ్‌లు మాట్లాడుతూ చిరంజీవితో పనిచేయడం అద్భుతమైన అనుభూతి అని అన్నారు.

“‘నాన్నతో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నా. ఆ సినిమాకు తప్పకుండా మీకే అవకాశం ఇస్తా’ అని చరణ్ బాబు ఎప్పుడో గోవిందుడు అందరివాడేలే టైమ్‌లో చెప్పారు. ఆయన చెప్పినట్టే మాట నిలబెట్టుకొని మాకు ‘ఖైదీ నెంబర్ 150’కి పనిచేసే అవకాశం ఇచ్చారు. చిరంజీవి గారి డ్యాన్సులు, ఫైట్స్ చూస్తూ పెరిగిన మాకు ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని రామ్-లక్ష్మణ్ తెలిపారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఖైదీ నెం. 150’లో చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.