ఈ వీకెండ్ అంతా యూఎస్‌లోనే సందడి చేయనున్న చరణ్!

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులను అలరించేందుకు రేపట్నుంచి ‘ధృవ’ సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమాపై అభిమానులంతా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక అభిమానుల ఆశలన్నింటినీ నిజం చేస్తూ, అంచనాలను అందుకునే స్థాయిలోనే సినిమా ఉంటుందని టీమ్ చెబుతూ వస్తోంది. ఈ అర్థరాత్రి నుంచే అమెరికాలో ప్రీమియర్స్ సందడి మొదలవుతోంది. రామ్ చరణ్ ప్రత్యేకంగా హాజరవుతూ ఉండడంతో ఈ ప్రీమియర్స్ కోసం అక్కడి తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 8న సాయంత్రం నుండి అక్కడ ప్రీమియర్స్ మొదలవుతాయి. డిసెంబర్ 8 నుంచి మొదలుకొని మూడు రోజుల పాటు యూఎస్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభిమానుల మధ్య చరణ్ సినిమా చూడనున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకూ చరణ్‌కు పెద్ద హిట్ ఒక్కటీ లేకపోవడంతో ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని నిర్ణయించుకునే రామ్ చరణ్ యూఎస్ టూర్‌కు వెళ్ళారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్‌కి రీమేక్. గీతా ఆర్ట్స్ సంస్థ సినిమాను నిర్మించగా రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు.