చరణ్ వైపే చూస్తోన్న సంక్రాంతి సినిమాలు..!

8th, December 2016 - 01:51:46 PM

ram-charan1
తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద సీజన్ ఏదీ అంటే సంక్రాంతి అనే చెప్పుకోవాలి. ఆ సీజన్‌లో తమ సినిమా వస్తే పండగే అని ప్రతి హీరో అభిమాని కోరుకుంటూ ఉంటారు. తాజాగా వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు ప్రతిష్టాత్మక సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ చేస్తోన్న ‘ఖైదీ నెం 150’ కాగా, మరొకటి నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ రెండు సినిమాలూ ఇప్పటికే భారీ అంచనాలను మూటగట్టుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక సంక్రాంతికే ఈ సినిమాలు విడుదలవుతున్నా తేదీలు ఏంటన్నది మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదలవుతుందని టీమ్ ఎప్పుడో ప్రకటించింది. ‘ఖైదీ నెం. 150’ జనవరి 11న గానీ, 12న గానీ ఏదో ఒక తేదీన విడుదలవుతుంది. ఖైదీ నెం. 150 నిర్మాత అయిన రామ్ చరణ్ ఈ రెండు తేదీల్లో ఇంకా దేన్నీ ఫైనల్ చేయలేదు. ఒకవేళ ఈ సినిమా 12న వస్తే గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల తేదీలో ఏ మార్పూ ఉండదు. అలాకాకుండా 11నే వచ్చేస్తే మాత్రం గౌతమిపుత్ర కూడా ఒకరోజు ముందుకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ రెండు సినిమాలతో పాటు వస్తోన్న మరో సంక్రాంతి సినిమా శతమానం భవతి కూడా ఖైదీ నెం. 150 విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. మరి రామ్ చరణ్ ఏ తేదీకి ఫిక్స్ అయి అన్ని సినిమాలనూ సెట్ చేస్తారో చూడాలి.