రామ్ చరణ్ కొత్త సినిమా మొదలైంది..!


విలక్షణ దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అనౌన్స్ అయిన రోజునుంచే మంచి అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా నేడు హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమాను లాంచ్ చేశారు. ఇక సుకుమార్ ఎప్పట్లానే ఈ సినిమాలోనూ కొత్తదనం చూపనున్నట్లు, లాంచ్ సందర్భంగా విడుదల చేసిన థీమ్ పోస్టర్ చూస్తే అర్థమైపోతోంది.

రామ్ చరణ్ దోతీ కట్టుకొని ఉండడం ఈ థీమ్ పోస్టర్‌లో చూడొచ్చు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా, డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా నడుస్తుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఈనెలనుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. చరణ్ సరసన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనున్నారు.