‘ధృవ’ను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ!
Published on Oct 10, 2016 12:50 pm IST

Ram-Gopal-Varma
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ పేరుతో మరో సంచలనాత్మక సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. రియల్ లైఫ్ కథలను, క్రైమ్ డ్రామాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడని పేరు తెచ్చుకున్న వర్మ, తన పంథాలో వంగవీటి రాధా, ఆయన తమ్ముడు వంగవీటి రంగాల చరిత్రను ‘వంగవీటి’ అన్న టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఈమధ్యే విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

వంగవీటితో వర్మ తన రక్త చరిత్ర మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారన్న ప్రచారం ట్రైలర్ విడుదలైనప్పట్నుంచే వినిపిస్తోంది. ఇక తాజాగా దసరా కానుకగా అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు ‘వంగవీటి’కి సంబంధించి మరికొన్ని విజువల్స్ విడుదల చేస్తారట. వీటిని ‘ధృవ తారల్లాంటి షాట్స్’ అంటూ ప్రస్తావించడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ ఫస్ట్ టీజర్ కూడా అక్టోబర్ 11నే సరిగ్గా 5 గంటలకే విడుదలవుతున్నందున, ‘ధృవ తారల్లాంటి షాట్స్’ అంటూ వర్మ ధృవను టార్గెట్ చేసినట్లు కనిపిస్తూనే ఉంది.

విజయవాడ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వంగవీటి రాధా ఒక శక్తిగా ఎదిగే క్రమంతో మొదలయ్యే వంగవీటి సినిమా కథ, ఆయన తమ్ముడు వంగవీటి రంగా హత్యతో ముగుస్తుందని వర్మ తెలిపారు. సందీప్, వంశీ ఛాగంటి, కౌటిల్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.

 
Like us on Facebook