‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై రూపొందుతున్న ‘అమీర్ లోగ్’ చిత్రం ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ ఈ చిత్రాన్ని నిర్మించగా, రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ విడుదల చేస్తోంది. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడంతో పాటు, ‘అవ్వల్ దావత్’ అనే పాటను కూడా విడుదల చేసింది.
హైదరాబాద్ నగర జీవనశైలి, బస్తీ సంస్కృతి, అక్కడి మనుషుల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు రమణా రెడ్డి తెలిపారు. నగరంలో సంతోషంగా జీవించే మనుషుల కథలను ఇందులో సహజసిద్ధంగా చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేధా జలంధర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా, స్మరణ్ సాయి సంగీతం అందించారు.
తెలుగు చిత్రసీమలో హైదరాబాద్ నేటివిటీతో వస్తున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.
