రానా చేతిలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ !


కెరీర్ ఆరంభం నుండే భాషా బేధం లేకుండా అన్ని పరిశ్రమల్లోనూ విభిన్నమైన సినిమాల్ని ఎంచుకుంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జాతీయ స్థాయి నటుడిగా మారిపోయాడు. ఇప్పుడు సరికొత్త కథలు, పాత్రలు ఆయనను వెతుకుంటూ వస్తున్నాయి. ఈమధ్యే ‘ఘాజి’ లాంటి వైవిధ్యమైన సినిమాతో మెప్పించిన ఆయన ప్రస్తుతం మరో విభిన్న కథాంశం కలిగిన సినిమాకు పని చేయనున్నారని వినికిడి.

కన్నడ దర్శకుడు ఏఎంఆర్ రమేష్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నైపథ్యంలో ఒక థ్రిల్లర్ సినిమాను చేయనున్నారట. అందులో సీబీఐ ఆఫీసర్ డిఆర్. కార్తికేయన్ పాత్రను రానా చేయనున్నాడని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తారట. ఇకపొతేరాన ప్రస్తుతం తేజ్ డైరెక్షన్లో ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే సినిమా చేస్తున్నాడు.