హిట్ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్న రానా !
Published on Mar 1, 2017 12:58 pm IST


తెలుగు ఇండస్ట్రీలో అందరి హీరోల్లా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. తెలుగు, హిందీ, తమిళం అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అన్ని పరిశ్రమలకు పరిచయమైన రానా ‘బాహుబలి’ చిత్రంతో ఇండియా మొత్తానికి సుపరిచితుడయ్యాడు. రొటీన్ ఫార్ములా సినిమాలు కాకుండా కొత్తగా ప్రయోగాత్మక చిత్రాలను చేయాలనే ఆలోచనతో రానా చేసిన ‘ఘాజి’ చిత్రం రానాకి ఒక ప్రత్యేక స్థాన్నాన్ని అందించింది. కొత్తగా ప్రయోగాలు చేయాలనుకునే వాళ్లంతా రానాను దృష్టిలో పెట్టుకునే కథలు రాసుకునే పరిస్థితి క్రియేట్ చేసింది.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేస్తున్న రానా తమిళంలో రెండు సినిమాలు చేస్తూ తన మొదటి చిత్రం ‘లీడర్’ కు సీక్వెల్ చేసే యోచనలో ఉన్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొంది 2010లో రిలీజైన ఈ పొలిటికల్ డ్రామా మంచి సినిమాగా నిలవడమేగాక రానాకు నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. అందుకే రానా ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారని, దానికి సంబందించిన పనులు కూడా మొదలయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం రానా స్థాయి, అతన్ని ఆడియన్స్ చూస్తున్న కోణం రెండు గతం కంటే చాలా వేరుగా ఉన్నాయి కనుక ఈ సీక్వెల్ రూపొందితే మంచి ఆదరణ దక్కించుకోవడం మాత్రం ఖాయం.

 
Like us on Facebook