హీరోలను గుర్తించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన రానా !

15th, February 2017 - 04:05:56 PM


ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఒక విషయమై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఆ లేఖలో దేశం కోసం పోరాడిన సైనికులను, వాళ్లకు దక్కాల్సిన గుర్తింపును ఆయన ప్రస్తావించించారు. తాజాగా 1971 ఇండియా – పాక్ ల మధ్య జరిగిన జలాంతర్గామి యుద్ధ నైపథ్యంలో రూపొందిన ‘ఘాజి’ చిత్రంలో రానా లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ అనే వాస్తవ పాత్రను పోషించారు. ఈ సినిమాకు పని చేసేటప్పుడు రానా ఇండియన్ నేవీ గురించి వివరాలు తెలుసుకునేందుకు ఆ కాలానికి చెందిన చాలా మంది నేవీ అధికారులను కలిశారు.

ఆ క్రమంలోనే అయన తాను చేస్తున్న అర్జున్ వర్మ పాత్ర గురించి తెలుసుకున్నారు. యుద్ధ సమయంలో అర్జున్ వర్మ సుమారు 18 రోజుల పాటు సూర్యుడిని చూడకుండా నీటిలోనే ఉన్నారని, ఆయనలాగే మరెంతో మంది వివిధ సైనిక విభాగాల్లో ఎన్నో వీరోచిత కార్యాలు చేశారని తెలుసుకుని చలించిన రానా ‘ఈ సినిమా తర్వాత ఒక గొప్ప హీరో గురించి నాలాగే అందరు తెలుసుకుంటారు. ఒక సామాన్య వ్యక్తిగా ఇలాంటి వీరులు చాలా మంది గురించి నాకు తెలీదు. నాలాగే తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ మన భద్రత కోసం పోరాడిన గొప్ప వీర సైనికులు, చరిత్రలో కనుమరుగైన హీరోలను గురించి తెలియజేప్పాల్సిన భాద్యత ఉంది’ అంటూ లేఖలో వినయపూర్వకంగా పేర్కొన్నారు.