భారీ స్థాయిలో ‘రంగ స్థలం 1985’ ప్రీ రిలీజ్ బిజినెస్ !


‘ధృవ’ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ‘రంగస్థలం 1985’ పై బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి. అంతేగాక సుకుమార్ దర్శకత్వం చేస్తుండటం, విభిన్నమైన కథాంశంతో సినిమా రూపొందుతుండటంతో మెగా అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో ఈ చిత్రం పట్ల ప్రత్యేక శ్రద్ద ఏర్పడింది. దీంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించిన స్థాయి కంటే భారీగానే జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు రూ. 16 కోట్లకు అమ్ముడవగా ఇతర డిజిటల్ రైట్స్ రూ. 13 కోట్లు పలికాయట. ఇక ఏరియాల వారీగా అమ్మే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా పెద్ద మొత్తంలోనే అమ్ముడై విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు మిగులుతాయని టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.