రవితేజ-దిల్‌రాజు సినిమా మొదలైంది..!


ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో ‘భద్ర’ తర్వాత చాలా కాలానికి ‘ఎవడో ఒకడు’ అన్న సినిమా ప్రారంభం అయి, సెట్స్‌పైకి వెళ్ళకముందే ఆగిపోయిన విషయం తెలిసిందే. రవితేజకు, దిల్‌రాజుకు మధ్య బేధాభిప్రాయాలు రావడం వల్లనే ఆ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. ఇక ఆ సినిమా ఆగిపోయినా కూడా ఈ ఇద్దరూ తమ కాంబినేషన్‌ను మళ్ళీ తాజాగా ‘రాజా ది గ్రేట్‌’తో పున:ప్రారంభించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమాను ప్రారంభించారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమాలో రవితేజ ఓ అంధుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్స్ బాగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రవితేజ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఆగష్టు నెలలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.