ఇంటర్వ్యూ : విజయేంద్ర ప్రసాద్ – నా విషాదం నుండి పుట్టిన కథే ఈ ‘శ్రీవల్లి’ !

12th, September 2017 - 05:25:54 PM

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మరోసారి మెగా ఫోన్ పట్టుకుని చేసిన సినిమా ‘శ్రీవల్లి’. ట్రైలర్, టీజర్ తో మంచి స్పందనను దక్కించుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో పలు విశేషాల్ని పంచుకున్నారు. ఆ సంగతులు మీకోసం..

ప్ర) సర్.. అసలు ఈ కథ ఎలా పుట్టింది ?

జ) నాకు రమేష్ అనే స్నేహితుడు ఉండేవాడు. నేను హైదరాబాద్లో సెటిలయ్యాక వాడిని అస్సలు కలవలేదు. అప్పుడప్పుడు గుర్తొస్తుండేవాడు. 2010 వినాయకచవితి ముందు రోజున చాలా ఎక్కువగా గుర్తొచ్చాడు. ఆ తర్వాత రెండేళ్ళకి వైజాగ్ వెళ్ళినప్పుడు కలవాలని వాడి ఇళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాను. కానీ వాడు 2010 వినాయకచవితి ముందురోజున చనిపోయాడని, ఆ రోజు నన్ను బాగా తలచుకున్నాడని వాళ్ళ అమ్మ చెప్పింది. ఆ బాధలోనే ఒక ఆలోచన ఇద్దరికి ఎలా వచ్చింది, మా ఇద్దరికీ మధ్య ఆ రోజున ఆలోచనల మార్పు జరిగిందా అనే థాట్ మొదలై ఈ కథ పుట్టింది. నా విషాదం నుండి పుట్టిన కథే ఇది.

ప్ర) అసలు ఈ సినిమా దేని గురించి ?
జ) ఒక మనిషిలో ఆలోచనలు అతని మనసు నుండి పుడతాయి. ఆ ఆలోచనా తరంగాల్ని స్టడీ చేయగలిగితే అతని మనసుని చదవగలం. దాని ద్వారా ఆ మనసులోని చెడుని, రుగ్మతల్ని పోగొట్టవచ్చు. ఇదొక థీరీ. దీని గురించే ఈ సినిమా. సినిమాలో జరిగే మిషన్ పేరే శ్రీవల్లి.

ప్ర) ఇందులో ఇంకా ఏయే అంశాలు ఉంటాయి ?
జ) ఈ చిత్రం ఒక మానసిక విశ్లేషణగా మొదలై ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా మారుతుంది. అదే సమయంలో థ్రిల్లింగా కూడా ఉంటుంది. కథలో ఊహకందని చాలా ట్విస్టులు ఉంటాయి.

ప్ర) సినిమా చాలా ఆలస్యమైనట్టుంది ?
జ) అవును. సీజీ వర్క్ ఎక్కువగా ఉండటం వలన సినిమా ఆలస్యమైంది.

ప్ర) సైన్స్ అంటేనే వాస్తవం. దాన్ని సినిమాటిక్ గా ఎలా తీశారు ?
జ) అవును. సైన్స్ అంటేనే నిజం. దానికి అన్ని ఆధారాలు ఉంటాయి. ఈ సినిమా విషయంలో వాస్తవానికి కొంత ఫిక్షన్స్ జోడించి సినిమాకు కావాల్సిన కథను తయారుచేసుకున్నాను.

ప్ర) సినిమాను చూసిన వాళ్లంతా ఏమన్నారు ?
జ) నా సర్కిల్ లో ఉన్న చాలా మంది దర్శకులకు, రచయితలకు సినిమా చూపించాను. అందరూ బాగుందన్నారు. కొత్త తరహా సినిమా అని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ కామన్ గా చెప్పిన పాయింట్ చిత్రం చాలా థ్రిల్లింగా ఉంది అని.

ప్ర) అన్నిటిలోకి మీకందిన బెస్ట్ కాంప్లిమెంట్ ?
జ) పరుచూరి గోపాలకృష్ణగారికి సినిమా చూపించాను. సినిమా చూసే సమయంలో తర్వాత ఏం జరుగుతుందో ఊహించగలిగితే పాస్ చేసి నాకు చెప్పండి అన్నాను. కానీ ఆయన ఎక్కడా పాస్ చేయలేదు. ఒక్క ట్విస్టు కూడా ఊహకురాలేదని అన్నారు. అదే నాకు రచయితగా ఇప్పటి వరకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్.

ప్ర) మీ కథలంటే ప్రేక్షకుల్లో ఒక నమ్మకముంది. ఈ సినిమాతో దాన్ని ఎలా నిలబెట్టుకుంటారు ?
జ) నా నుండి కొత్త తరహా కథ వస్తుందని నమ్మి ఈ సినిమాకు వచ్చే ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరుత్సాహం ఉండదు.

ప్ర) మీరు కథ అందిస్తున్న ‘మణికర్ణిక’ గురించి చెప్పండి ?
జ) ‘మణికర్ణిక’ నిర్మాతలు నా వద్దకు వచ్చి ఘాన్సీ లక్ష్మి భాయ్ గురించి మంచి కథను సిద్ధం చేయమన్నారు. నేను దర్శకత్వం క్రిష్ అయితేనే కథను రాస్తానని చెప్పాను. ఎందుకంటే ఆ సినిమాకి అతనే సరైన దర్శకుడు కాబట్టి. వాళ్ళు కూడా శాతకర్ణి సినిమా చూసి క్రిష్ ను దర్శకుడిగా ఒప్పుకున్నారు.

ప్ర) హిందీలో నాయక్ సినిమాకు సీక్వెల్ రాస్తున్నారని విన్నాం ?
జ) అవును. రాస్తున్నాను. అలాగే ‘మెర్సల్’ ఆడియో వేడుకలో ఏఆర్ రెహమాన్ నా వద్దకు వచ్చి నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను, నా దగ్గర ఒక లైన్ ఉంది, కథ రాసిపెడతారా అని అడిగాడు.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ఒక తెలుగు, ఒక హిందీ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాను. ఈ దసరాకి ఆ రెండు చిత్రాల్ని అనౌన్స్ చేస్తాను.