‘ధృవ’కి డేట్ ఫిక్స్ చేసిన రామ్ చరణ్!

ram-charan-in
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ధృవ’ ఎప్పుడెప్పుడు థియేటర్ల ముందుకు వచ్చేస్తుందా.. ఎప్పుడెప్పుడు చూసేద్దామా.. అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈమధ్యే విడుదలైన టీజర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలవుతుందంటూ టీమ్ కొద్దికాలంగా చెబుతూ వస్తున్నా, ఏ రోజున విడుదలవుతుందన్నది మాత్రం చెప్పలేదు. తాజాగా ఇదే విషయమై ధృవ టీమ్ నుంచి ఓ సమాచారం అందింది.

డిసెంబర్ 2వ తేదీన ధృవను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో టీమ్ ఉందని తెలిసింది. ఇప్పటికే ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సినిమా త్వరలోనే ఆడియో వేడుక జరుపుకోనుంది. ఇక ఆడియో విడుదల తేదీతో పాటే, డిసెంబర్ 2న సినిమాను విడుదల చేయనున్నారన్న ప్రకటన కూడా ఈవారమే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్‌కి రీమేక్ అయిన ఈ పోలీస్ థ్రిల్లర్‌లో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తూండగా, అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు.