ప్రముఖ నిర్మాత చేతికి ‘చుట్టాలబ్బాయి’ నైజాం రైట్స్
Published on Jul 19, 2016 9:13 pm IST

Malkapuram-Shivakumar
ప్రముఖ నటుడు సాయికుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న ఆది, తాజాగా ‘చుట్టాలబ్బాయి’ అనే సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల చివరిదశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కొద్దికాలంగా ఓ సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న ఆదికి, ఈ సినిమా తప్పకుండా మంచి విజయం తెచ్చిపెడుతుందన్న అభిప్రాయం ట్రైలర్, ఆడియో విడుదలైనప్పట్నుంచి వినబడుతోంది.

ఇక థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో విడుదలయ్యాక ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోందని టీమ్ తెలిపింది. నైజాం ఏరియాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘శౌర్య’ సినిమాల నిర్మాత మల్కాపురం శ్రీనివాస్ పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నారట. కామెడీ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతోంది. ఆది సరసన నమితా ప్రమోద్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను వెంకట్ తలారి, రామ్ తల్లూరి నిర్మించారు.

 
Like us on Facebook