నవంబర్ 26న “జీ 5″లోకి సాయి తేజ్ హిట్ మూవీ ‘రిపబ్లిక్’..!

Published on Nov 3, 2021 9:25 pm IST


అగ్రగామి ఓటీటీ వేదికలో ఒకటైన ‘జీ5′ ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, టీవీ షోస్‌, వెబ్‌ సిరీస్‌లను వివిధ భాషల్లో అందిస్తూ ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో ‘జీ 5’ ఉంటే చాలు.. వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. థియేటర్లలో విడుదల అయిన సినిమాలను సైతం వీక్షకుల ముందుకు తీసుకొస్తుంది.

అయితే తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్‌లు హీరో హీరోయిన్‌లుగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. అక్టోబరు 1న రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంత ఉంటుంది? ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకుల ధోరణి ఏ విధంగా ఉంది? ప్రజలను ఏవిధంగా దోచుకుంటున్నారు? అనే కథాంశంతో రిపబ్లిక్ తెరకెక్కింది. కాగా కలెక్టర్ పాత్రలో సాయితేజ్ నటన సగటు రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ, ప్రభుత్వ ఉద్యోగిగా, తండ్రిగా జగపతిబాబు భావోద్వేగ భరిత అభినయం, దేవ కట్టా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పతాక సన్నివేశాలు సమాజంలో ప్రజల ఆలోచనా విధానాన్ని సైతం ఎండగట్టాయి. ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఉన్న ఈ చిత్రాన్ని ‘జీ 5’ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది.

సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా కూడా ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ‘రిపబ్లిక్’ సైతం ‘జీ 5’ ఓటీటీలోకి‌ వస్తోంది. వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా ‘జీ 5’ వరుసగా కొత్త సినిమాలను విడుదల చేస్తోంది. దసరా పండక్కి శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ను విడుదల చేయగా, ఇప్పుడు దీపావళి కానుకగా ఈ నెల 4వ తేదీన ‘శ్రీదేవి సోడా సెంటర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. దీని తర్వాత నవంబర్ 26న ‘రిపబ్లిక్’ చిత్రాన్ని విడుదల చేయనుంది.

సంబంధిత సమాచారం :