
‘ఓకే బంగారం(ఓకే కన్మణి)’ సినిమా ద్వారా తెలుగు, తమిళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చిన మళయాల హీరో దుల్కర్ సల్మాన్. సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా 2012లో మళయాల సినీ పరిశ్రమలో తెరగేంట్రం చేసిన దుల్కర్, ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ తన మ్యాజిక్ సినిమాతో మన ముందుకొచ్చిన మణిరత్నం ‘ఓకే బంగారం’ సినిమాలో అద్భుతంగా నటించి తెలుగు, తమిళ పరిశ్రమల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు దుల్కర్. గత శుక్రవారం విడుదలైన ‘ఓకే బంగారం’ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన దుల్కర్, నిత్యా మీనన్‌లకు ప్రశంసలు వెల్లువెత్తాయి.
తాజాగా ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దుల్కర్ సల్మాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. దుల్కర్ తన తండ్రి మమ్ముట్టి కంటే అద్భుతమైన నటుడని, మమ్ముట్టియే దుల్కర్ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలని వర్మ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకూ దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టికి సాధ్యం కాని ఇతర భాషల్లో స్టార్డమ్ సంపాదించడమనే ఫీట్‌ను దుల్కర్ అతి త్వరలోనే సాధించగలడని వర్మ తెలిపాడు. ఇక వర్మ నుండి వచ్చిన ఈ ట్వీట్ల వర్షం తర్వాత, “మా నాన్న యాక్టర్‌గా సాధించిన దాంట్లో కొంత భాగాన్ని కూడా నేను పది జన్మలెత్తిన సాధించలేను” అని దుల్కర్ సల్మాన్ ఓ ట్వీట్ చేయడం విశేషం. కాగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై సోషల్ మీడియాలో ఎక్కువగా నెగటివ్ కామెంట్లు వినిపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.