ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో వివాదానికి తెర దించిన ఆర్జీవీ !
Published on Jan 18, 2017 9:44 pm IST

rgv
గత 10, 15 రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఖైదీ నెం 150’ రిలీజ్, సక్సెస్, కలెక్షన్స్ ఎంతటి హడావుడి సృష్టించాయో మెగా ఫ్యామిలీకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మధ్య తలెత్తిన వివాదం కూడా అంతే సంచలనం అయింది. ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు ఆర్జీవీ చిరంజీవిపై, తమ కుటుంబంపై చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించి వర్మను తీవ్ర స్థాయిలో విమర్శించారు. దాంతో వర్మ కూడా నాగబాబుపై ట్విట్టర్లో రివర్స్ అటాక్ చేస్తూ తారా స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒకానొక దశలో ఖైదీ చిత్రాన్ని కూడా రకరకాలుగా విమర్శించారు. చిరంజీవి కూడా పలు ఇంటర్వ్యూల్లో దీనిపై స్పందించి వర్మ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నట్టు చెప్పారు. అయినా వర్మ ట్వీట్ల యుద్ధం ఆపకపోవడంతో ఆ వివాదం ఎంతవరకు వెళుతుందో అని అభిమానులు, సినీ జనం కంగారుపడ్డారు. వర్మ కూడా ఆ ఇష్యూని అంత తేలిగ్గా వదిలేలా కనిపించలేదు.

కానీ విచిత్రంగా వర్మ ఈరోజు ఖైదీనెం 150 సినిమా చూశానని, మెగాస్టార్ అద్భుతంగా ఉన్నారని, ఎనర్జీ లెవల్స్ సూపరని, 9 ఎళ్ళ క్రితం సినిమాలు వదిలినప్పటికన్నా చిరు ఇప్పుడే యంగ్ గా కనిపిస్తున్నారని ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్స్ కు మెగా అభిమానులు కూడా సంతృప్తి చెందారు. దీంతో మెగా ఫ్యామిలీతో వర్మ వివాదానికి దాదాపు తెరపడినట్లయింది.

 
Like us on Facebook