వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో రెండు సామాజిక వర్గాల నడుమ సాగిన ఆదిపత్య పోరులా ఈ సినిమా కథ, కథనాలు ఉండనున్నాయి. అయితే కథలోని పాత్రలన్నీ తెలుగు రాజకీయాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల పాత్రలే.
ఈ పాత్రల్లో వైఎస్.జగన్, చంద్రబాబు నాయుడు పాత్రలతో పాటు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది. వర్మ నిన్న రిలీజ్ చేసిన పోస్టర్లో పవన్ పాత్ర కూడా కనిపించింది. దీంతో పవన్ అభిమానుల్లో అలజడి మొదలైంది. అసలే కులాలను, రాజకీయాలను బేస్ చేసుకుని తీస్తున్న సినిమా, పైగా పవన్ మీద వ్యంగ్యాస్త్రాలు వేయడమంటే వర్మకు మహా సరదా, వీటన్నింటికీ తోడు సొంత సినిమా కాబట్టి పాత్రల్ని, కథని ఆయన ఎలాగైనా మలుచుకోగలడు.
కాబట్టి తమ అభిమాన హీరో కమ్ పొలిటీషియన్ పాత్రను ఆర్జీవీ అభ్యంతరకరమైన రీతిలో చూపుతాడని కంగారుపడుతూ అలాంటిదేమైనా జరిగితే ఊరుకునేది లేదని ఇప్పటి నుండే సోషల్ మీడియాలో హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో కూడా పవన్ అభిమానులకు, వర్మకు మధ్యన అనేకసార్లు వివాదాలు జరిగడం అవి తీవ్ర రూపం దాల్చడం తెలిసిన సంగతే. వాటి మూలంగా పవన్ అభిమానులకు వర్మ అంటేనే రవ్వంత కూడా పడని పరిస్థిత ఉంది. సో వ్యవహారం ముదిరితే ఇంకోసారి గొడవ తప్పదంటున్నారు ప్రేక్షకులు. మరి వర్మ పవన్ పాత్రను కథలో ఎలా మలిచాడో ఒక అంచనా రావాలంటే ఈ నెల 27న ట్రైలర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
