నాగబాబు, వరుణ్ తేజ్ లకు సారీ చెప్పిన వర్మ !

14th, April 2017 - 08:46:06 AM


స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గత రెండు రోజుల నుండి ట్విట్టర్ ద్వారా తనతో వివాదాలున్న అందరికీ సారీ చెప్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కు, ఆయన అభిమానులకు సారీ చెప్పిన వర్మ ఈరోజు మెగా బ్రదర్ నాగబాబుకు క్షమాపణలు చెప్పారు. గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ తన అన్నయ్యపై, తమ్ముడు పవన్ కళ్యాణ్ పై అనవసర కామెంట్స్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో స్పందించారు.

నాగబాబు మాటలకు బదులుగా వర్మ కూడా ట్విటర్లో అంతకంటే ఘాటుగానే జవాబులు చెబుతూ వివాదాన్ని తారా స్థాయికి తీసుకెళ్లారు. ఒకానొక దశలో వర్మ వివాదంతో ఎలాంటి సంబంధం లేని నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను సైతం అందులోకి లాగారు. అలా కొన్ని రోజులపాటు కొనసాగిన ఆ వివాదం మెల్లగా సద్దుమణగ్గా వర్మ ఈరోజు పొద్దు పొద్దున్నే ‘వరుణ్ తేజ్ మీ నాన్న విషయంలో నాపై నీ కామెంట్స్ చదివాను. తప్పు నావైపే ఉంది. మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాను’ అన్నారు.

అలాగే నాగబాబును ఉద్దేశించి ‘చిరంజీవి లాంటి అన్నయ్య నాకంటే నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని. నాగబాబు కాబట్టి మాటల్తో వదిలేశారు. ఆయనకు కూడా సారీ’ అన్నారు. ఇలా వర్మ ఉన్నట్టుండి మొదలుపెట్టిన క్షమాపణలు పర్వం చూసి సినీ జనాలంతా కాస్త ఆశ్చర్యానికి లోనవుతున్నారు.