‘అర్జున్ రెడ్డి’ వ్యవహారంలో కలుగజేసుకున్న ఆర్జీవీ !


విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది ‘అర్జున్ రెడ్డి’ చిత్రం వివాదాల పరంగా హాట్ టాపిక్ అవుతోంది. నిన్నటికి నిన్న ముద్దు పోస్టర్ల వివాదంలో చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగను పోలీసులు ప్రశ్నించగా తాజాగా స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ వివాదంలో కలుగజేసుకుని వ్యవహారాన్ని మరింత వేడెక్కించారు. వర్మ సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు చింపేసిన వి.హనుమంతరావును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘హనుమంతరావు పోస్టర్లను ఎందుకు చింపారో అర్థం కావడంలేదు. బహుశా విజయ్ దేవరకొండను అందమైన అమ్మాయి ముద్దుపెట్టుకోవడం ఆయనకు నచ్చలేదేమో. ఈ పోస్టర్లో ఏమైనా తప్పుందేమో విహెచ్ తన మనవళ్ళు, మానవరాళ్లను అడగాలి’ అన్నారు. అలాగే ‘ఎలాంటి స్లో మోషన్, రాంపింగ్ షాట్లు లేకుండానే హీరోలా కనబడే వ్యక్తి విజయ్ దేవరకొండ మాత్రమే’ అంటూ హీరోని కూడా పొగిడేశారు. మరి వర్మ చేసిన ఈ కామెంట్స్ ఎంతవరకు దారి తీస్తాయో చూడాలి. ఇకపోతే ఈ క్రేజీ చిత్రం ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కానుంది.