అరవటం ఆపకపోతే ఇరగ్గొడతాను : వర్మ

rgv
రామ్ గోపాల్ వర్మ అంటే ఇండియన్ సినిమాలో క్రైమ్ డ్రామా జానర్‌కు బ్రాండ్ డైరెక్టర్. ఈ జానర్‌లో ఆయన చూపిన కొత్తదనాన్ని వేరొక దర్శకులెవ్వరూ చూపలేదన్న పేరుంది. తాజాగా ఆయన వంగవీటి రంగ జీవిత కథ ఆధారంగా ‘వంగవీటి’ అనే క్రైమ్ సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ సినిమా కొద్దిరోజులుగా బాగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. విజయవాడలోనే ఈ సినిమా విడుదల చేయాలని వర్మ ప్లాన్ చేయడం, అందుకు రంగ కుమారుడు రాధ అడ్డు చెప్పడం లాంటివి బాగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇక వీటన్నింటినీ ఎదుర్కొని వర్మ తాను అనుకున్నట్లుగానే విజయవాడలోనే వైభవంగా ఆడియో లాంచ్ నిర్వహించారు.

విజయవాడలోని కేల్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుకకు పెద్ద ఎత్తున అభిమానులు విచ్చేశారు. ఇక ఈ సందర్భంగానే వర్మ మాట్లాడుతూ ఉంటే వారంతా అరుపులతో కోలాహలం చేశారు. ‘ఒక డైలాగ్ చెప్పాలి, డైలాగ్ చెప్పాలి’ అని అభిమానులంతా అరుస్తూ ఉన్న సమయంలో, “డైలాగ్ చెప్పాలా.. అరవటం ఆపకపోతే ఇరగ్గొడతా!” అని నవ్వుతూ అన్నారు. దీంతో మళ్ళీ అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో అరవడం మొదలుపెట్టారు. విజయవాడలో పుట్టిపెరిగిన తనకు ఇక్కడి రాజకీయాలు, రౌడీయిజమే చాలా నేర్పించిందని, వంగవీటి సినిమా తనకు ఎమోషనల్‌గా చాలా దగ్గరైన సినిమా అని వర్మ ఈ సందర్భంగా తెలిపారు. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా, ఆడియో లాంచ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి.