కమెడియన్ సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’పై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘మత్తు వదలరా’ సిరీస్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న రితేష్, ఈసారి కమెడియన్ సత్యను హీరోగా పెట్టి పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని రూపొందించాడు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రోమోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రమోషన్ కంటెంట్‌లో కనిపిస్తున్న ఫన్ థియేటర్లలో కూడా వర్కవుట్ అయితే, రితేష్ ఖాతాలో మరో హిట్ చేరినట్టేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాలో కూడా రితేష్ తన మార్కు సెంటిమెంట్లను కొనసాగించినట్లు తెలుస్తోంది. గత చిత్రాల్లో లాగే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన రిఫరెన్సులతో పాటు, టీవీ సీరియల్స్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేసినట్లు సమాచారం. ఒకవేళ ‘జెట్లీ’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో కూడా దర్శకుడు ఉన్నాడట. దీనితో పాటు ‘మత్తు వదలరా 3’ ప్లానింగ్ కూడా ప్రస్తుతం చర్చల్లో ఉంది.
అయితే వీటికంటే ముందు రితేష్ రానా ఒక హారర్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘మత్తు వదలరా’ మొదటి భాగం లాగే, ఈ హారర్ చిత్రాన్ని కూడా పూర్తిగా కొత్త నటీనటులతో రూపొందించాలని ఆయన భావిస్తున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైంది. ‘జెట్లీ’ విడుదల తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. విభిన్నమైన కథాంశాలతో మెప్పించే రితేష్, హారర్ జోనర్‌లో ఎలాంటి ప్రయోగం చేస్తాడో చూడాలి.
