విక్రమ్ సినిమాలో చాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్!


‘పెళ్ళిచూపులు’ అనే సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాలో నటించినవారంతా ఇప్పుడు అంతటా పాపులర్ అయిపోయారు. ఇక తాజాగా పెళ్ళిచూపులులో హీరోయిన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్న రీతూ వర్మ, తమిళ స్టార్ హీరో విక్రమ్ సినిమాకు హీరోయిన్‌గా ఎంపికవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ధృవ నచ్చత్తిరం’ అనే సినిమాకు మొదట అను ఎమ్మాన్యూల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోషూట్స్ కూడా జరిగాయి.

కాగా డేట్స్ కుదరక అను, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో వెంటనే దర్శకుడు గౌతమ్ మీనన్, రీతూ వర్మను ఎంపిక చేశారట. రీతూ ఇప్పటికే సెట్స్‌లో జాయినైపోయినట్లు కూడా తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రీతూ చేస్తోన్న పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందట. ఆగష్టు నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తున్నారు.