సద్దుమణగని ‘రుద్రమదేవి’ వివాదం !

19th, January 2017 - 08:52:00 AM

rudramadevi
అనుష్క ప్రధాన పాత్రదారిగా గుణశేఖర్ దర్శకత్వ, నిర్మాణంలో రూపుదిద్దుకుని 2015 లో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల విడుదలైన బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో పన్ను రాయితీ కల్పించడంతో గుణశేఖర్ 2015 లో తాను చేసిన ‘రుద్రమదేవి’ కూడా తెలుగు జాతి సంస్కృతికి సంబందించిన చిత్రమే అని, అప్పుడు పన్ను రాయితీ కోరగా తెలంగాణా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందే కానీ ఏపీ సర్కార్ మాత్రం పట్టించుకోలేదని, ఇప్పటికైనా తన విజ్ఞప్తిని పరిశీలించి పన్ను రాయితీని నగదు బహుమతి రూపంలో వెనక్కు ఇవ్వాలని కోరాడు.

కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఏ విధంగాను స్పందించలేదు. దీంతో తెలుగువారు కొందరు సోషల్ మీడియా వేదికగా 13వ శతాబ్దంలో లింగ వివక్షను ఎదుర్కున్న రుద్రమదేవి మళ్ళీ ఇప్పుడు 700 ఏళ్ల తర్వాత 21వ శతాబ్దంలో కూడా అదే వివక్షకు గురైందని అంటూ మీసకట్టుతో ఉన్న రుద్రమదేవి ఫోటోను పోస్ట్ చేసి ఏపీ ప్రభుత్వం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ఒక పురుషునికి చెందిన చరిత్ర కావడం, పైగా ముఖ్యమంత్రి వియ్యంకుడు చేసిన సినిమా కావడంతో పన్ను రాయితీ ఇచ్చారని, దీనిపై విచారణ జరిపి తక్షణమే న్యాయం జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ఇప్పటికీ స్పందించిన ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.