కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. నాలో నేనే లేను, సమ్మోహనుడా, ఎందుకురా బాబు పాటలు ఒక దానిని మించి ఒకటి ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి నాలుగో పాటను విడుదల చేశారు మేకర్స్.
‘రూల్స్ రంజన్’ నుంచి ‘దేఖో ముంబై’ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియో మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా ఈరోజు(సెప్టెంబర్ 19) ఉదయం 10:20 గంటలకు విడుదలైంది. విడుదల సందర్భంగా పాట బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించిన రవితేజ, చిత్రం ఘన విజయం సాధించాలని ఆకంక్షించారు. ముంబై నగరాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ పాట బాగా ఎనర్జిటిక్ గా ఉంది. అమ్రిష్ గణేష్ అందించిన సంగీతం ఎవరి చేతనైనా కాలు కదిపించేలా ఉంది.
ఈ గీతానికి కాసర్ల శ్యామ్, మేఘ్-ఉ-వాట్ సాహిత్యం అందించారు. “దేఖో ముంబై దోస్తీ మజా.. పీకే కర్ లో మస్తీ మజా..” అంటూ తెలుగు, హిందీ పదాలతో పాటను అల్లిన తీరు అమితంగా ఆకట్టుకుంది. సంగీతం, సాహిత్యం, గానంతో పాటు శిరీష్ నృత్య రీతులు ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’.