‘సాహసం శ్వాసగా..’ విడుదల ఎప్పుడంటే..!

Sahasem-savasaga-sagipo
దర్శకుడు గౌతమ్ మీనన్, హీరో నాగచైతన్యల కాంబినేషన్‌లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. టీజర్, ఆడియోతో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా చాలాకాలంగా ఓ సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. మొదట జూలై 15నే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా ప్రకటించినా, ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. అదేవిధంగా మళ్ళీ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో కూడా టీమ్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో ఇక ఈ సినిమా ఇప్పట్లో విడుదల కాదనే ప్రచారం కూడా మొదలైంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇదే విషయమై ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటనిచ్చారు. దర్శకుడు గౌతమ్ మీనన్‌తో సినిమా విడుదల తేదీ గురించి మాట్లాడానని, ఆగష్టులోనే సినిమా విడుదల కానుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విడుదల తేదీ ఏంటన్నది రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. గౌతమ్ మీనన్ – నాగ చైతన్య – ఏ.ఆర్.రహమాన్‌ల కాంబినేషన్‍లో ‘ఏ మాయ చేసావే’ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడం ‘సాహసం శ్వాసగా సాగిపో’కు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించారు.