భారీ డీల్ కు నో చెప్పిన ‘సాహో’ నిర్మాతలు !

3rd, January 2018 - 05:51:39 PM

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యువీ క్రియేషన్స్ నిర్మాణంలో ‘సాహో’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ‘బాహుబలి-2’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టే నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. హీరోయిన్ శ్రద్ద కపూర్ తో సహా పలువురు బాలీవుడ్ స్టార్లను ఇందులో నటింపజేస్తూ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రేజ్ ను గమనించిన బడా నిర్మాణ సంస్థ టి సిరీస్ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ హక్కులను సొంతం చేసుకునేందుకు దాదాపు రూ. 240 కోట్ల రూపాయల్ని నిర్మాతలకు ఆఫర్ చేసిందట. కానీ యువీ క్రియేషన్ మాత్రం ఆ ఆఫర్ ను తిరిస్కరించిందని వినికిడి. మరి ఇంత పెద్ద మొత్తాన్ని నిర్మాతలు కాదన్నారంటే బిజినెస్ పరంగా సినిమా స్థాయి ఏమిటో అర్థమవుతోంది. ఇకపోతే సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్, ఈషాన్, లోయ్ లు సంగీతాన్ని అందిస్తున్నారు.