ఇంటర్వ్యూ : సాయి ధరమ్ తేజ్ – చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో మల్టీ స్టారర్ చేయాలని ఉంది !

Sai-Dharam-Tej-in
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి సూపర్ హిట్ చిత్రాలతో సూపర్ స్పీడ్ తో దూసుకుపోతున్న సుప్రీం హీరో ‘సాయి ధరమ్ తేజ్’ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలన్న లక్ష్యంతో ‘తిక్క’ సినిమాతో ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్బంగా ఆయనతో మేము జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం….

ప్ర) ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.. ఎలాంటి టెంక్షన్ లేదా ?
జ) ఉంది.. ఈ సినిమాలో నా రోల్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కాస్త టెంక్షన్ గా ఉంది.

ప్ర) అసలు సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
జ) ఒక అమ్మాయితో లవ్ బ్రేక్ అప్ అయిన తరువాత అబ్బాయి పొజిషన్ ఏమిటి అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. అన్ని సినిమాల్లోలాగే జోష్ గా కూడా ఉంటుంది.

ప్ర) ‘తిక్క’ అనే టైటిల్ ఎలా పెట్టారు ?
జ) ఈ సినిమాలో లవ్ బ్రేక్ అప్ అయిన అబ్బాయి సిట్యుయేషన్ అంతా తిక్క తిక్కగా ఉంటుంది. పొద్దున్నుంచి సాయంత్రం లోపల అతను అలాంటి పరిస్థితుల్ని చాలా ఎదుర్కుంటాడు. అందుకే ఈ టైటిల్ పెట్టాం.

ప్ర) ఈ సినిమాలో ‘పవన్ కళ్యాణ్’ ప్రస్తావన ఏమైనా ఉందా ?
జ) లేదు ఈ సినిమాలో ‘పవన్ కళ్యాణ్’ గురించిన ప్రస్తావన ఏమీ ఉండదు. ఇది సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమా కూడా కాదు.

ప్ర) పోస్టర్స్, ట్రైలర్స్ చూస్తే సినిమా క్వాలిటీ అదిరిపోయినట్టుంది ?
జ) అవును. ఈ సినిమా క్వాలిటీ పరంగా చాలా బాగుటుంది. అలాగని ఇది భారీ బడ్జెట్ సినిమా కూడా కాదు. చాలా మామూలు బడ్జెట్ తో తీసిన సినిమా. బెస్ట్ క్వాలిటీ ఏక్యూప్మెంట్ ఈ సినిమాలో వాడాం.

ప్ర) సినిమాలో ఆల్కాహాల్ కంటెంట్ తో కూడిన సన్నివేశాలు చాలా ఉన్నట్టున్నాయి.. హాలీవుడ్ ‘హ్యాంగోవర్’ లా ఉంటుందా ?
జ) లేదు. హాలీవుడ్ సినిమా ‘హ్యాంగోవర్’ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది.

ప్ర) ఈ పాత్రను ఒప్పుకోవడానికి కారణం ?
జ) ఇందులో క్యారెక్టర్ కొత్తగా ఉంటుందనిపించింది. అందుకే ఒప్పుకున్నా. చిరంజీవి గారు కూడా గతంలో ఇలాంటి పాత్రలు చాలా చేశారు. వాళ్ళలా నేనూ చెయ్యాలనే ఈ సినిమా ఒప్పుకున్నాను. పైగా ఇది నాకు చాలెంజింగా ఉంటుందనిపించింది. తాగుబోతు రమేష్ పాత్ర ఎలా చెయ్యాలో నాకు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాడు.

ప్ర) ‘తిక్క’ అనే టైటిల్ పరంగా ఫ్యామిలీ నుండి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి ?
జ) తిక్క అనే టైటిల్ వినగానే చిరంజీవిగారు గాని, మిగతా పెద్దవాళ్ళు గానీ ఏమీ అనలేదు. బన్నీ, చరణ్ లాంటి నా ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రం ఆ టైటిల్ ఏంటని సరదాగా అన్నారు అంతే.

ప్ర) మిగతా మెగా హీరోలకన్నా మీరు ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు.. స్టోరీని అంత త్వరగా ఎలా ఒకే చేస్తారు ?

జ) నేను కథ గురించి ఎక్కువగా ఆలోచించను. కథ వినేటప్పుడు ఓ కామన్ ఆడియన్ లాగానే వింటా. ఆ కథ వర్కవుట్ అవుతుంది అనిపించగానే ఒకే చెప్పేస్తా. పెద్దగా టైమ్ తీసుకోను.

ప్ర) మిగతా మెగా హీరోలతో మీ కాంపిటీషన్ గురించి ?
జ) మా ఫ్యామిలీలో హీరోల మధ్య కాంపిటీషన్ ఉండదు. మంచి కథలు వస్తే, అవి నచ్చితే చేసుకుంటూ వెళ్లిపోతుంటాం అంతే.

ప్ర) మెగా హీరోలెవరితోనైనా మల్టీ స్టారర్ చేయాలని ఉందా ?
జ) ఖచ్చితంగా. నాకైతే చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, చరణ్, బన్నీ, వరుణ్ అందరితో కలిసి చేయాలనుంది. సరైన కథ దొరికి టైమ్ కలిసొస్తే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో కూడా చేస్తున్నాను.

ప్ర) ఈ సినిమాలో ధనుష్, శింబులతో పాటలు పాడించారు. అది ఎవరి ఐడియా ?
జ) ఈ క్రెడిట్ పూర్తిగా థమన్ కే దక్కుతుంది. ఈ పాటలు వాళ్ళు పాడితే బాగుంటుందని నమ్మి అతనే వాళ్ళనడిగాడు. వాళ్ళు కూడా అడగ్గానే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పేసుకున్నారు.

ప్ర) మీ బ్రదర్ సినిమాల్లోకి వచ్చే ఛాన్సుందా ?
జ) అప్పుడే ఏమీ అనుకోలేదు. ప్రస్తుతానికి చదువుకుంటున్నాడు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేం.

ప్ర) వేరే భాషల్లో సినిమాలు చేసే ఆలోచనేమన్నా ఉందా ?
జ) ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఒకవేళ వేరే భాషల్లో సినిమా చేస్తే రీమేక్ చెయ్యను. స్ట్రైట్ సినిమానే చేస్తాను.

ప్ర) డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో పని చేయడం ఎలా ఉంది ?

జ) డైరెక్టర్ సునీల్ రెడ్డి నాకు చాలా కాలంగా తెలుసు. పిల్లా నువ్వులేని జీవితం టైమ్ లోనే ఈ కథ విన్నాను. అతని పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక నిర్మాత ‘రోహిణ్ రెడ్డి’ గారు కథ చెప్పి సినిమా కోసం ఎంతైనా ఖర్చుపెడతాని, బాగా తీస్తానని అన్నారు. అన్నట్టుగానే ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమా తీశారు. అందరినీ చాలా బాగా చూసుకున్నారు.

ప్ర) కృష్ణ వంశీ సినిమాలో మీ క్యారెక్టర్ ఏమిటి ?
జ) కృష్ణ వంశీ తీస్తున్న నక్షత్రం సినిమాలో నాది పోలీస్ రోల్. 20 నిముషాలు ఉంటుంది. ఆ క్యారక్టర్ గురించి నాక్కూడా ఏమీ తెలీదు. కృష్ణవంశీ గారు అడగ్గానే ఒకే చెప్పేశా. షూటింగ్ కు వెళితే అసలు పాత్ర ఏమిటనేది తెలుస్తుంది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెబుతారా ?
జ) మలినేని గోపి చాంద్ తో సినిమా 20 నుండి మొదలవుతుంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ మాటల్లోనే ఉన్నాయి. కన్ఫర్మ్ అవగానే చెప్తాను.