సూర్య సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన సమంత!

SAMANTHA
తమిళ సూపర్ స్టార్ సూర్య, విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ’24’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. గత సంవత్సరం ‘సికిందర్’ (అంజాన్)తో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. 2015లో మాత్రం అలా జరగకుండా ఉండేందుకు సరికొత్త కథాంశాల నేపథ్యంలో సినిమాలు తీస్తున్నాడు.

ఇప్పటికే ‘మాస్’ సినిమాను పూర్తి చేసిన సూర్య ఈ మధ్యే విక్రమ్ కుమార్ ’24’ సినిమా షూటింగ్‌కు షిఫ్టైపోయాడు. ఏప్రిల్ 9న మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో హీరోయిన్ సమంత కూడా పాల్గొంది. ముంబైలో ఈ సినిమా కోసం వేసిన ఓ భారీ సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఎక్కువ భాగం ముంబై నేపథ్యంలో నడవనున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌లో సమంత పార్ట్ ఇప్పటికే పూర్తైంది. ఫస్ట్ షెడ్యూల్‌లో తన పార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. ’24’ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని సమంత ట్వీట్ చేసింది.

’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ద్వారా సరికొత్త కథాంశాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను ఓ సైన్స్ ఫిక్షన్‌ కథతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో డిసెంబర్ నెల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ’24’ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సూర్య నటించిన ‘మాస్’ సినిమా మే 15న గానీ, 23న గానీ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version