కొరటాల శివను ఆట పట్టించిన సమంత!

samantha
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో తెలుగులో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం కేరళలో ఓ షెడ్యూల్ జరుపుకుంటోంది. నిన్న మొదలైన ఈ షెడ్యూల్‌లో ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ ఉదయం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట షూటింగ్ జరుగుతుండగా, హీరోయిన్ సమంత, దర్శకుడు కొరటాల శివను ఆట పట్టించారు.

వర్షం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ పాట షూట్ మొదలవ్వాలంటే, ముందు కొరటాల శివ కూడా ఆ వర్షంలో తడవాలని సమంత షరతు పెట్టారట. ఇక కొరటాల శివ కూడా ఆ వర్షంలో తడిసాకే షూటింగ్ మొదలుపెట్టారట. ఈ విషయాన్ని సమంత స్వయంగా తెలియజేస్తూ దర్శకుడ్ని ఆట పట్టించినట్లు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా, దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఆడియో ఆగష్టు 12న విడుదలవుతుంది.