సమంత “యశోద” రిలీజ్ డేట్ ఫిక్స్.. చైతూ, అఖిల్ సినిమాలకు పోటీ..!

Published on Apr 5, 2022 9:53 pm IST

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక సమంత క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. సాధారణంగా పెళ్లి, విడాకుల వంటి వాటి తర్వాత హీరోయిన్లకు ఆఫర్స్‌ తగ్గుతుంటాయి. కానీ సమంత మాత్రం పెళ్లి, విడాకులు తర్వాత కూడా వరుస అవకాశాలతో బిజీగా మారింది. అయితే సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా “యశోద” రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ అయ్యింది.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. హరి-హరీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో సమంత అక్కినేని వారసుల సినిమాలతో పోటీ పడనున్నట్టు తెలుస్తుంది.

అదేలా అంటే “యశోద” చిత్రానికి ఒక రోజు ముందు అమీర్ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాతోనే అక్కినేని నాగచైతన్య బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇకపోతే అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన ‘ఏజెంట్’ సినిమాను కూడా ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. మరీ నిజంగానే ఈ మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడతాయా లేక ఏదైనా సినిమా బరి నుంచి తప్పుకుంటుందా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :