సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమనం’ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఒక అత్యంత భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తోంది. కేవలం ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే మేకర్స్ ఏకంగా రూ.20 కోట్లు కేటాయించడం విశేషం. సుమారు 35 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్లో 18 భారీ యాక్షన్ బ్లాక్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ప్రముఖ స్టంట్ మాస్టర్ కెవిన్ కంపోజ్ చేస్తున్న ఈ క్లైమాక్స్, మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఒక యుద్ధభూమిని తలపిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇది ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ వండర్‌గా నిలవనుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాత్ర కోసం సాయి దుర్గ తేజ్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, క్లైమాక్స్‌లో వచ్చే రిస్కీ స్టంట్స్‌ను డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నాడట. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, వెట్రివేల్ పళనిసామి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మేజర్ అసెట్ కానున్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
