ఇంటర్వ్యూ : సంపూర్ణేష్ బాబు – ‘ది ప్యారడైజ్’ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది..!

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి భారీగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాటలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సంపూర్ణేష్ బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

బిర్యాని క్యారెక్టర్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశారు కదా?
దర్శకుడు శ్రీకాంత్ గారు ఫోన్ చేసి ‘బిర్యానీ’ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను చేయని ఒక సీరియస్ రోల్ ఇది. ఇందులో ఎలాంటి కామెడీ ఛాయలు ఉండవు. నా కెరీర్‌లోనే ఇది పూర్తి భిన్నమైన పాత్ర. ఈ సినిమాలో నేను నాని గారికి బెస్ట్ ఫ్రెండ్‌గా నటిస్తున్నాను. సినిమా ఆద్యంతం నా క్యారెక్టర్ ఉంటుంది.

నాని గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
నాని గారు సెట్‌లో నాకు ఎంతగానో కంఫర్ట్ ఇచ్చారు. ఇంత పెద్ద సినిమాలో ఇన్ని రోజులు పనిచేయడం నాకిదే మొదటిసారి. షూటింగ్ సమయంలో ఆయన డెడికేషన్ చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

మీరు మోహన్ బాబు గారి బ్యానర్ లో ఒక సినిమా చేశారు.. ఇప్పుడు ఆయనతో కలిసి నటిస్తున్నారు ఎలా అనిపిస్తుంది?
మోహన్ బాబు గారితో కలిసి నటించడానికి నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో ఆయనతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయని చెప్పగానే ఎంతో ఆనందం వేసింది. ఎప్పటినుంచో ఉన్న నా కల ఈ చిత్రంతో నెరవేరినట్లు అనిపించింది.

అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ప్యారడైజ్ బిర్యానీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ సినిమా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. నా క్యారెక్టర్ అయితే అంతకంటే వైవిధ్యంగా ఉంటుంది, అది ఎలా ఉందో సెప్టెంబర్ 24న మీరే వెండితెరపై చూస్తారు. డైరెక్టర్ శ్రీకాంత్ గారు ప్రతి పాత్రను ఎంతో క్లారిటీతో, ప్రాధాన్యత ఉండేలా డిజైన్ చేశారు. సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ అద్భుతంగా కుదిరాయి. ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల కట్ట’ పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

నిర్మాత సుధాకర్ గారి గురించి ?
నిర్మాత గారు షూటింగ్ సమయంలో నన్ను చాలా కంఫర్ట్‌గా చూసుకున్నారు. సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత గ్రాండ్‌గా నిర్మించారు; ఇందులో వరల్డ్ బిల్డింగ్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. రెమ్యూనరేషన్ పరంగా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికంటే ఈ చిత్రానికే అత్యధిక పారితోషికం అందుకోవడం విశేషం.

Exit mobile version